EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › NTR Commissionerate - DCP LO-1 - Machavaram
Awareness
OFFICIAL

NTR Commissionerate - DCP LO-1 - Machavaram

Conducted: 30 October, 2026 NTR Commissionerate Venue: LOYALA COLLEGE EAGLE 500 Attendees
మాదకద్రవ్య రహిత యువతతోనే శక్తిమంతమైన భారతదేశ నిర్మాణం – ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్

యువతను బలహీనపరిస్తే దేశాన్ని బలహీనపరిచినట్లే

నార్కో టెర్రరిజం, అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ రాడికలైజేషన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

డ్రగ్స్‌కు ధైర్యంగా 'నో' చెప్పాలి – ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాల వ్యతిరేక యోధుడిగా మారాలి
డేటా ఆధారిత పోలీసింగ్, ప్రత్యేక ఆపరేషన్లతో మాదకద్రవ్యాలపై ఏపీ ఈగల్ పోరాటం
📅 తేదీ: 30-10-2026
📍 స్థలం: విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
విజయవాడలో నిర్వహించిన వందేమాతరం జాతీయ యువజన శిబిరంలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఒక్కో రాష్ట్రానికి 25 మంది చొప్పున మొత్తం 125 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ గారు హాజరై "భారతదేశానికి మాదకద్రవ్యాల రూపంలో పెరుగుతున్న సవాళ్లు" అనే అంశంపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఐజి గారు మాట్లాడుతూ, యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 1921లో విజయవాడలో మహాత్మా గాంధీజీకి పింగళి వెంకయ్య జాతీయ పతాక నమూనాను సమర్పించిన చారిత్రక సంఘటనను గుర్తుచేస్తూ, విజయవాడ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించారు.
నాలుగు తల్లుల కన్నీటి కథలు – యువతకు హెచ్చరిక
మాదకద్రవ్యాల వల్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధలను వివరిస్తూ నాలుగు సంఘటనలను ప్రస్తావించారు. విశాఖపట్నం సెంట్రల్ జైలులో గంజాయి అక్రమ రవాణా కేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న బీటెక్ యువకుడు, గుంటూరులో తల్లి హెచ్చరికలను పట్టించుకోకుండా డ్రగ్స్ కేసులో చిక్కుకున్న మరో యువకుడు, విజయనగరం లో సోషల్ మీడియా పరిచయాల ద్వారా గంజాయికి అలవాటుపడిన 16 సంవత్సరాల బాలిక, పంజాబ్‌లో మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలను ప్రశ్నిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త సంఘటనలను వివరించారు.
ఈ సంఘటనలు మాదకద్రవ్యాలు వ్యక్తుల జీవితాలతో పాటు తల్లిదండ్రుల ఆశలను, కుటుంబాల ఆనందాన్ని కూడా దెబ్బతీస్తున్నాయని తెలియజేస్తున్నాయని తెలిపారు.
నార్కో టెర్రరిజం – దేశ భద్రతకు పెను సవాలు
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ కేసులో పట్టుబడిన యువకుడు అడిగిన ప్రశ్నను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, మాదకద్రవ్యాల కోసం ఖర్చు చేసే డబ్బు చివరకు ఎక్కడికి చేరుతుందో యువత ఆలోచించాలని సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం ద్వారా సమకూరే నిధులు కొన్ని సందర్భాల్లో ఉగ్రవాద సంస్థలు, సాయుధ నేర ముఠాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయని, దీనినే నార్కో టెర్రరిజం అంటారని వివరించారు.
గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నుంచి జరిగే అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా, మయన్మార్‌లో సింథటిక్ డ్రగ్స్ తయారీ, పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా హెరాయిన్ అక్రమ రవాణా వంటి అంశాలను వివరించారు.
చైనాలో జరిగిన నల్లమందు యుద్ధాలు, కొలంబియాలో పాబ్లో ఎస్కోబార్ అక్రమ డ్రగ్స్ సామ్రాజ్యం, అమెరికాలో ఫెంటానిల్ ముప్పు వంటి ఉదాహరణల ద్వారా మాదకద్రవ్యాల సమస్య దేశాల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
"ఒక చిన్న మాదకద్రవ్యాల ప్యాకెట్ కూడా దేశ భద్రతకు ముప్పు కలిగించే అక్రమ నెట్‌వర్క్‌లో భాగం కావచ్చు. దేశాన్ని ప్రేమించే వ్యక్తి మాదకద్రవ్యాలను ముట్టుకోడు" అని పేర్కొన్నారు.
డిజిటల్ రాడికలైజేషన్ – యువత అప్రమత్తంగా ఉండాలి
సోషల్ మీడియా ద్వారా యువతను నేర, తీవ్రవాద నెట్‌వర్క్‌లలోకి ఆకర్షించే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షహజాద్ భట్టి నెట్‌వర్క్‌కు సంబంధించిన దర్యాప్తులను ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్, డార్క్‌నెట్, క్రిప్టోకరెన్సీ వంటి సాంకేతిక మార్గాలను నేరస్థులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
"Before You Click, Think" అనే సందేశంతో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, విశ్వసనీయ వనరుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు.
ప్రత్యేక ఆపరేషన్లతో ఈగల్ చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ సంస్థ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను వివరించారు.
ఆపరేషన్ గరుడ ద్వారా మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ అవసరమైన ఔషధాల అక్రమ విక్రయాలపై తనిఖీలు, *ఆపరేషన్ వజ్రప్రహార్* ద్వారా డ్రగ్స్ హాట్‌స్పాట్‌లపై నిఘా, *సేఫ్ క్యాంపస్* ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లో మాదకద్రవ్యాలు, పొగాకు విక్రయాల నియంత్రణ, ఈగల్ ఆన్ ట్రైన్స్ ద్వారా రైళ్లలో అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ చైతన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి అక్రమ సాగును అరికడుతూ, గిరిజన రైతులకు కాఫీ, అవకాడో, వెదురు తదితర ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
అదేవిధంగా నార్కో ఆఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మాదకద్రవ్యాల నేరస్థులు, అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల కార్యకలాపాలను విశ్లేషిస్తూ, ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిపారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో చట్ట అమలు, ప్రీకర్సర్ కెమికల్స్ నియంత్రణ, డిమాండ్ తగ్గింపు, వ్యసనాల వల్ల కలిగే హాని తగ్గింపు అనే నాలుగు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Strong Minds Don't Need Drugs – డ్రగ్స్‌కు 'నో' చెప్పండి
విద్యార్థులు స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా మాదకద్రవ్యాలను ధైర్యంగా నిరాకరించాలని సూచించారు. "డ్రగ్స్ తీసుకోమని ప్రోత్సహించే వ్యక్తి నిజమైన స్నేహితుడు కాదు" అని పేర్కొన్నారు.
యువత క్రీడలు, వ్యాయామం, చదువు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని, అవసరం లేని అలవాట్లను వదిలేయడం కూడా నేర్చుకోవాలని తెలిపారు.
"Learning is Important, but Unlearning Bad Habits is Equally Important" అని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారిని దూరం పెట్టకుండా చికిత్స, కౌన్సెలింగ్, డీ-అడిక్షన్, పునరావాస సేవలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు.
బ్రేక్ ది సైలెన్స్ – కాల్ 1972
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972*కు తెలియజేయాలని కోరారు. జాతీయ స్థాయిలో *MANAS హెల్ప్‌లైన్ 1933 కూడా అందుబాటులో ఉందని తెలిపారు.
"మీరు నేరుగా డ్రగ్స్ విక్రయదారులతో పోరాడాల్సిన అవసరం లేదు. మీరు సమాచారం ఇవ్వండి. మీ తరఫున మేము పోరాటం చేస్తాం" అని స్పష్టం చేశారు.
అక్టోబర్ 31న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న Fight Against Drugs జాతీయ మోటార్‌సైకిల్ ర్యాలీ మరియు ర్యాలీ లో ఈగల్ భాగస్వామ్యం గురించి కూడా వివరించారు.
చివరిగా విద్యార్థులు శిబిరంలో నేర్చుకున్న విషయాలను తమ ప్రాంతాల్లోని ఇతర యువతకు తెలియజేసి, మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
"యువత ఆరోగ్యంగా, చైతన్యవంతంగా ఉన్నప్పుడే దేశం శక్తిమంతంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో యోధుడిగా మారాలి" అని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ గారు పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ డిఎస్పీ వేణు గోపాల్ రెడ్డి గారు, సీఐ రవీంద్ర గారు,YES-J సెంటర్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ ఫాదర్ బి. బాలకుమార్ గారు, మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ ఉజ్వల్ గారు, మై భారత్ జిల్లా యువజన అధికారి శ్రీ ఎం. ప్రదీప్ గారు ఆర్ ఐ నాగార్జున గారు, ఎస్ ఐ లు డ్రగ్స్ భవాని, ఆర్ ఎస్ ఐ రాంబాబు గారు మరియు ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.