EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Guntur - West Sub Division
Awareness
OFFICIAL

Guntur - West Sub Division

Conducted: 28 October, 2026 Guntur Venue: Acharya Nagarjuna University, Guntur District. EAGLE 300 Attendees
🦅గుంటూరు ఈగల్ సెల్🦅
📅 తేదీ: 28-10-2026
📍స్థలం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు జిల్లా.
🔰ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఘనంగా ఓరియంటేషన్ అండ్ ఇండక్షన్ కార్యక్రమం
🔰యువత శక్తిమంతంగా ఉంటేనే దేశం శక్తిమంతంగా ఉంటుంది – ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్
🔰మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ రాడికలైజేషన్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
🔰జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి
🔸గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ఆధ్వర్యంలో డాక్టర్ హెచ్.హెచ్. డైచ్‌మన్ మరియు డాక్టర్ ఎస్. జాన్ డేవిడ్ ఆడిటోరియంలో ఓరియంటేషన్ అండ్ ఇండక్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
🔸ఈ కార్యక్రమానికి ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
🔸ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, భారతీయ యువత మేధస్సు, ప్రతిభ, సామర్థ్యాలను అనేక దేశాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. తాను గతంలో ఒక దేశ రాయబార కార్యాలయంలో పనిచేసిన సమయంలో సుమారు 60 నుంచి 70 దేశాలకు చెందిన దౌత్యవేత్తలతో మాట్లాడే అవకాశం లభించిందని, వారందరూ భారతదేశ గొప్పతనాన్ని, భారతీయ యువత ప్రతిభను ప్రశంసించేవారని గుర్తుచేశారు.
🔸ప్రపంచంలోని అనేక దేశాల్లో యువ జనాభా తగ్గుతున్న తరుణంలో భారతదేశంలో అధిక సంఖ్యలో యువత ఉండటం దేశానికి గొప్ప శక్తి అని, దీనినే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారని వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో, అదేవిధంగా స్వర్ణాంధ్ర నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
🔸జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు సూచించారు. స్వామి వివేకానంద చెప్పిన "Arise, Awake and Stop Not Till the Goal Is Reached" అనే సూక్తిని గుర్తుచేశారు.
🔸తాను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న రోజుల అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. యూనివర్సిటీలో చేరిన మొదటి రోజుల్లో సీనియర్ల ద్వారా సివిల్ సర్వీసెస్ గురించి తెలుసుకున్నానని, అప్పటివరకు తనకు సివిల్ సర్వీసెస్ పరీక్షల గురించి అవగాహన లేదని తెలిపారు. ఆ పరిచయమే తన జీవితంలో ఒక గొప్ప లక్ష్యానికి పునాది వేసిందని వివరించారు.
🔸యూనివర్సిటీలో చేరిన సమయంలో ప్రొఫెసర్ కేఎల్వీ రమణారావు గారు విద్యార్థులందరికీ తెల్ల కాగితాలు ఇచ్చి భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారో రాయమని చెప్పారని, తాను ఆ కాగితంపై ఐపీఎస్ అని రాశానని గుర్తుచేశారు. చివరకు తాను ఐపీఎస్ అధికారిగా ఎదిగానని తెలిపారు.
🔸విద్యార్థులు యూనివర్సిటీలో గడిపే రెండు, మూడు సంవత్సరాలు తమ భవిష్యత్తును నిర్ణయించడంలో ఎంతో కీలకమని, ఈ సమయంలో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధిస్తే రాబోయే నలభై సంవత్సరాల జీవితానికి బలమైన పునాది ఏర్పడుతుందని సూచించారు.
🔸మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ రాడికలైజేషన్‌పై అప్రమత్తంగా ఉండాలి
🔸ఈ సందర్భంగా ఆయన మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, ఆన్‌లైన్ రాడికలైజేషన్ కారణంగా యువత ఎదుర్కొంటున్న ప్రమాదాలను విద్యార్థులకు వివరించారు.
🔸సామాజిక మాధ్యమాల ద్వారా యువతీయువకులను ఆకర్షించి, అనంతరం ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వారిని చట్టవ్యతిరేక కార్యకలాపాల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
🔸ముఖ్యంగా మాదకద్రవ్యాలకు అలవాటుపడిన యువతను, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిని కొన్ని నేర నెట్‌వర్క్‌లు లక్ష్యంగా చేసుకుంటున్నాయని, చిన్నచిన్న పనుల పేరుతో వారిని మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర నేర కార్యకలాపాల్లోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
🔸ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని నేర నెట్‌వర్క్‌ల ఉదాహరణలను ప్రస్తావిస్తూ, ఆన్‌లైన్ రాడికలైజేషన్ దేశ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు.
🔸అదేవిధంగా భారతదేశంలోకి మాదకద్రవ్యాలు అక్రమంగా ప్రవేశించే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
🔸ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలను గోల్డెన్ క్రెసెంట్‌గా, మయన్మార్, లావోస్, థాయిలాండ్ ప్రాంతాలను గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలుస్తారని వివరించారు. ఈ ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని, ముఖ్యంగా హెరాయిన్, మెథాంఫెటమైన్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు.
🔸మాదకద్రవ్యాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజానికి, దేశ భద్రతకు కూడా ప్రమాదకరమని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన నేరాలపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని వివరించారు.
🔸ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ద్వారా బాధితులకు సహాయం
🔸ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో జరిగిన ఒక సంఘటనను విద్యార్థులకు వివరించారు.
▪️ఒక తల్లి తన కుటుంబంలో ఎదుర్కొంటున్న మాదకద్రవ్యాల సమస్య గురించి ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫోన్ చేసి సమాచారం అందించారని తెలిపారు.
▪️ఆమె కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడిన పరిచయాల కారణంగా గంజాయికి బానిసైందని, అనంతరం తన 13 ఏళ్ల తమ్ముడికి కూడా గంజాయి అలవాటు చేసిందని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసినట్లు వివరించారు.
▪️ఆ కుటుంబం ఇప్పటికీ మాదకద్రవ్యాల కారణంగా ఏర్పడిన సమస్యల నుంచి పూర్తిగా బయటపడలేకపోతోందని పేర్కొన్నారు.
▪️ఇలాంటి సంఘటనలు సమాజంలో మాదకద్రవ్యాల వల్ల ఏర్పడుతున్న తీవ్ర పరిణామాలకు ఉదాహరణలని తెలిపారు.
🔸సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పరిచయాలు, అనుమానాస్పద ఆన్‌లైన్ గ్రూపులు, మాదకద్రవ్యాలకు సంబంధించిన ప్రలోభాలకు దూరంగా ఉండాలని సూచించారు.
🔸"మీరు బలహీనమైతే దేశం బలహీనమవుతుంది. మీరు శక్తిమంతంగా ఉంటే దేశం శక్తిమంతంగా ఉంటుంది" అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
🔸మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉన్నా, ఎవరైనా మాదకద్రవ్యాల బారిన పడినట్లు తెలిసినా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972* ద్వారా సమాచారం అందించాలని సూచించారు.
🔸ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
🔸విద్యార్థులు తమ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలని, తమ లక్ష్యాలను ఒక పుస్తకంలో రాసుకుని వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.
🔸చిన్ననాటి నుంచి అందరికీ తెలిసిన కుందేలు–తాబేలు కథను ఉదాహరణగా తీసుకుని జీవితంలో లక్ష్యసాధన ప్రాధాన్యతను వివరించారు.
🔸విద్యార్థులు ఒకరికొకరు సహకరించుకుంటూ, పరస్పరం ప్రోత్సహించుకుంటూ విద్యతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
▪️కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
▪️ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు గారు ముఖ్య పోషకులుగా వ్యవహరించారు.
▪️విశిష్ట అతిథిగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఎస్. భరత్ కుమార్ గారు పాల్గొన్నారు.
▪️గౌరవ అతిథులుగా విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రెక్టార్ ప్రొఫెసర్ ఆర్. శివరామ ప్రసాద్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సురేష్ కుమార్ గారు పాల్గొన్నారు.
▪️ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
▪️ఈగల్ డిఎస్పీ త్రినాథ్ గారు, గుంటూరు ఈగల్ సీఐ కె. విక్టర్ గారు, సిఐ రుద్ర రమేష్ గారు, ఎస్ ఐ ఎం. సునీల్ బాబు, రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.