ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ IPS గారు మరియు ఈగల్ ఎస్పీలు శ్రీ మహేశ్వర్ రాజు, ఐపీఎస్ గారు, శ్రీమతి స్వరూపరాణి, ఐపీఎస్ గార్ల ఆదేశాల మేరకు, ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ సబ్ డివిజన్ పరిధిలోని హిందూపూర్ టౌన్‌లో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ మరియు స్థానిక పోలీసుల సమన్వయంతో ఆపరేషన్ గరుడ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలోని మెడికల్ షాపులు మరియు ఫార్మాస్యూటికల్ ఏజెన్సీలను తనిఖీ చేసి, ఔషధాల నిల్వ, విక్రయ విధానం, ప్రిస్క్రిప్షన్ ఆధారిత మందుల పంపిణీ, సంబంధిత రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తించిన లోపాలను డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి స్వభావాన్ని బట్టి సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.
తనిఖీలు ముగిసిన అనంతరం మెడికల్ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించి, ఔషధాల విక్రయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులను నిబంధనలకు అనుగుణంగా విక్రయించాలని, నార్కోటిక్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన చట్టపరమైన నియంత్రణలను పాటించాలని, గడువు ముగిసిన మందులను విక్రయించరాదని, మందుల కొనుగోలు–విక్రయ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించడం జరిగింది. అలాగే మత్తు పదార్థాల దుర్వినియోగానికి అవకాశం కల్పించే విధంగా మందులను విక్రయించకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లావాదేవీలు లేదా అక్రమ విక్రయాలు గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలియజేయడం జరిగింది.
మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈగల్ సోషల్ మీడియా వేదికలను ఫాలో/సబ్‌స్క్రైబ్ చేయాలని మెడికల్ షాపుల యజమానులకు సూచించి, మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని కోరడం జరిగింది.
ప్రజారోగ్య పరిరక్షణ, ఔషధాల అక్రమ విక్రయాల నియంత్రణ, మత్తు పదార్థాల దుర్వినియోగ నివారణ లక్ష్యంగా వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ గరుడ నిర్వహించబడింది. మెడికల్ షాపుల యజమానులు చట్టపరమైన బాధ్యతలను పాటిస్తూ, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.