గంజాయి మాఫియాపై అనకాపల్లి పోలీసుల ఉక్కుపాదం: సుమారు 70 లక్షల విలువగల 140 కేజీల గంజాయి స్వాధీనం – ఇద్దరు వ్యక్తులు పట్టివేత
కంటైనర్ లారీలో రహస్య అరను ఛేదించిన ‘ఈగల్ టీమ్’ &amp కశింకోట పోలీసులు
స్వాధీనం చేసుకున్న గంజాయి, కంటైనర్ లారీ, 2 మొబైల్ ఫోన్లు
ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జిల్లాలో డ్రగ్స్ రవాణా చేస్తే పీడీ యాక్ట్, ఆస్తుల జప్తు తప్పవు: జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, IPS హెచ్చరిక
అనకాపల్లి, అక్టోబర్ 16: జిల్లాలో మాదకద్రవ్యాల నిరోధానికి చేపట్టిన ప్రత్యేక నిఘా మరియు ఉక్కుపాదం చర్యల్లో భాగంగా కశింకోట పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా భారీ గంజాయి అక్రమ రవాణాను చాకచక్యంగా భగ్నం చేశారు.
ఎన్‌హెచ్-16 జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఘటన వివరాలు:
తేదీ 15.10.2026న కశింకోట పోలీస్ స్టేషన్ సి.ఐ (CI) ఎ.స్వామి నాయుడు గారికి అందిన ముందస్తు, విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీమ్ మరియు కశింకోట పోలీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్‌హెచ్-16 (NH-16) జాతీయ రహదారిపై కశింకోట సమీపంలోని HOP హోటల్ ఎదురుగా ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అటుగా వచ్చిన GJ 01 DZ 7861 నంబర్ గల కంటైనర్ లారీని ఆపగా, అందులోని ఇద్దరు వ్యక్తులు పోలీసులను గమనించి పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.
వారిలో లారీ డ్రైవర్ సద్దాం హుస్సేన్ కాగా, మరొకరు 17 ఏళ్ల మైనర్ బాలుడు.
రహస్య క్యాబిన్‌లో భారీ నిల్వలు: కంటైనర్ లారీని నిశితంగా పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఎవరికీ అనుమానం రాకుండా డ్రైవర్ సీటు వెనుక భాగంలో ప్రత్యేకంగా ఒక రహస్య క్యాబిన్‌ను నిర్మించారు. అందులో దాచిన 28 ప్యాకెట్ల (మొత్తం 140 కేజీలు) గంజాయిని, రవాణాకు ఉపయోగించిన కంటైనర్ లారీని, ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరియు ఒక కీప్యాడ్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ టు ఒడిశా లింకులు – ముమ్మర దర్యాప్తు: ప్రాథమిక విచారణలో రాజస్థాన్‌కు చెందిన కిసాన్ @ కిషన్ జీ @ కిషన్ జాట్ అనే ప్రధాన సూత్రధారి ఆదేశాల మేరకు వీరు ఒడిశా రాష్ట్రం నుంచి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయిని స్వీకరించినట్లు తేలింది. అనంతరం మర్రిపాలెం టోల్ ప్లాజా సమీపంలోని లే-బై (Lay-by) రోడ్డులో లారీ క్యాబిన్‌లో దాచి, రాజస్థాన్‌కు తరలించేందుకు పక్కా ప్రణాళిక వేసినట్లు వెల్లడైంది.
ఈ అంతర్రాష్ట్ర గంజాయి నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర నిందితులు, సరఫరాదారుల వివరాలను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు.
న్యాయపరమైన చర్యలు: పట్టుబడిన ప్రధాన నిందితుడు సద్దాం హుస్సేన్‌ను అరెస్ట్ చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలుడిని (CICL) విశాఖపట్నంలోని జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.
గంజాయి రవాణా చేస్తే పీడీ యాక్ట్ తప్పదు – జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, IPS హెచ్చరిక:
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారు మాట్లాడుతూ:
*అనకాపల్లి జిల్లాను గంజాయి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది. జిల్లా మీదుగా అక్రమ రవాణా చేసేందుకు ఎంతటి అధునాతన మార్గాలు ఎంచుకున్నా పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేరు.
గంజాయి సాగు, నిల్వ, రవాణా, కొనుగోలు లేదా విక్రయాలలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భాగస్వాములయ్యే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అలవాటుపడిన నేరగాళ్లపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేయడంతో పాటు వారి అక్రమ ఆస్తులను జప్తు చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాం. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాలపై సమాజం కూడా పోరాడాలి. ప్రజలు లేదా వాహనదారులు తమ పరిసరాల్లో గంజాయి రవాణాపై ఏ సమాచారం ఉన్నా నిర్భయంగా పోలీసులకు తెలపవచ్చు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.*
సకాలంలో స్పందించి చాకచక్యంగా గంజాయి రవాణాను అడ్డుకున్న కశింకోట సిఐ ఎ.స్వామి నాయుడు గారిని, ఈగల్ టీమ్ సభ్యులను, కశింకోట పోలీస్ సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు నగదు రివార్డులను అందజేశారు.
ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పీ.వీ.వీ. నరసింహారావు, ఎస్.బి డీఎస్పీ శ్రీ వి.బాబ్జీరావు
సిఐ స్వామి నాయుడు, ఈగల్ టీం ఇన్స్పెక్టర్ నారాయణరావు
ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.